మద్య నిషేధం కోసం దీక్షలా ?
గద్వాల : మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఇంటి పునాదులే మద్యంపై నిలిచాయని, అలాంటిది ఆమె మద్యం బంద్ చేయాలని దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యపానం అమలు వల్ల మహిళలపై అఘాత్యాలు పెరిగిపోతున్నాయని వెంటనే మద్యాన్ని బంద్‌చేయాలని హైదరాబాద్‌లో అరుణ దీక్ష చేస్తుంటే ప్రజలు నవ్వుకోవడంతో పాటు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని ఎమ్మెల్యే బండ్ల ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడారు.
డీకే కుటుంబం గద్వాలను సుమారు 40 ఏండ్లు పాలించిన కాలంలోనే నియోజకవర్గంలో మద్యం ఏరులై పారిందని గుర్తుచేశారు. వారి పాలనలోనే గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిశాయని, అప్పుడు మంచినీరు లభించని గ్రామాల్లో కూడా మద్యం దొరికేదని ఆయన స్పష్టం చేశారు. అరుణ పదవిలో ఉన్న సమయంలో జిల్లా కేంద్రంలో వారి అనుచరులవే 40 దాక దాబాలు ఉండేవని, వీటికి ఆమె భర్త వైన్ షాపుల ద్వారా మద్యం సరఫరా చేసి గద్వాల నియోజకవర్గంలో ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెగిపోవడానికి వారు కారణమయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో దాబాలు బంద్ చేయించడంతో పాటు బెల్ట్ దుకాణాలు అరికట్టామని స్పష్టం చేశారు.
ఈ మద్య జరిగిన మద్యం టెండర్లలో మాజీ ఎమ్మెల్యే భర్తతో పాటు ఆయన అనుచరులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 15 నుంచి 25 వరకు మద్యం దుకాణాలు దక్కించుకున్నారని తెలిపారు. అరుణ మద్యం బంద్‌పై దీక్ష చేసేటప్పుడు మొదట తన భర్తకు వచ్చిన మద్యం దుకాణాలు బంద్ చేసి తరువాత మద్యం బంద్‌పై ఆందోళన చేస్తే బాగుండేదన్నారు. డీకే అరుణ కుటుంబం జీవితం ప్రారంభమైందే మద్యం ద్వారా అని ఈ విషయం మరచి ఆమె దీక్ష చేయడం విడ్డూరమన్నారు. మద్యపాన నిషేధంపై మాట్లాడే అర్హత డీకే అరుణకు లేదని అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి, పత్రికలు, టీవీల్లో పేరుకోసం దీక్ష చేస్తున్నారే తప్ప మహిళలపై గౌవరంతో కాదన్నారు.
నిజంగా మహిళా లోకంపై ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా తన ఇంటి నుంచే మద్యపాన నిషేధం ప్రారంభించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏమి పనిలేక, పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బదలాం చేయడానికే డీకే అరుణ ఈ దీక్ష చేస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వూ ఇస్తూ తమకు మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యం అమ్మితే తప్పేమని ఆమె చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఈ దీక్ష చేస్తే బాగుండేందని ఆయన అన్నారు. సమావేశంలో ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, రైతుసమన్వయ సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, కేశవ్, మహిమూద్ తదితరులు పాల్గొన్నారు.